బీజేపీకి, మోదీకి నా సంపూర్ణ మద్దతు ఉంటుంది: రష్మీ గౌతమ్
- మహిళలపై జరిగే అఘాయిత్యాలను తాను సమర్థించబోనన్న రష్మీ
- రాజకీయాలు వేరు.. మానవత్వం వేరని వ్యాఖ్య
- మూగజీవాల సంరక్షణే తన తొలి ప్రాధాన్యత అన్న రష్మీ
బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ తన రాజకీయ మొగ్గును, సామాజిక దృక్పథాన్ని స్పష్టం చేస్తూ చేసిన పోస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. సాధారణంగా సెలబ్రిటీలు తమ రాజకీయ అభిప్రాయాలను బహిరంగంగా చెప్పడానికి వెనుకాడతారు, కానీ రష్మీ మాత్రం ఎంతో ధైర్యంగా తన గళాన్ని వినిపించారు.
రష్మీ గౌతమ్ తన పోస్ట్‌లో భారతీయ జనతా పార్టీకి, ప్రధాని మోదీకి తన పూర్తి మద్దతు ఉంటుందని నిస్సంకోచంగా ప్రకటించారు. అయితే, ఇదే సమయంలో ఒక ముఖ్యమైన క్లారిటీ కూడా ఇచ్చారు. పార్టీకి మద్దతు ఇస్తున్నంత మాత్రాన, మహిళలపై జరిగే అఘాయిత్యాలను లేదా నేరస్తులను తాను సమర్థించబోనని స్పష్టం చేశారు. రాజకీయ మద్దతు వేరని... మానవత్వం, నైతిక విలువలు వేరని ఆమె చెప్పారు. తనను విమర్శించే వారు లేదా దూషించే వారి గురించి తాను అస్సలు పట్టించుకోనని, అలాంటి వారి వల్ల తన సమయం వృథా చేసుకోనని ఆమె ఘాటుగా సమాధానమిచ్చారు.
మరోవైపు, ప్రతి సామాజిక సమస్యపై సెలబ్రిటీలను ట్యాగ్ చేసే సంస్కృతిపై రష్మీ అసహనం వ్యక్తం చేశారు. కేవలం ఒక పోస్ట్ చేయడం వల్ల క్షేత్రస్థాయిలో మార్పు రాదని, సమస్యలను పరిష్కరించే అధికారం ఉన్న అధికారులను ప్రశ్నించాలని ఆమె సూచించారు. తాను మనుషుల సమస్యల పట్ల సానుభూతి చూపగలను తప్ప, వాటిపై పోరాడే శక్తి తనకు లేదని ఆమె నిజాయతీగా అంగీకరించారు. అందుకే, గొంతులేని మూగజీవాల సంరక్షణకే తాను ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని, ఆ దిశగానే తన పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.